దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జే. అరుణ శ్రీ, కొప్పుల వెంకట్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో పరిపాలనా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు, వినతిపత్రాల పరిష్కారంపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులో పరిష్కరించి తప్పనిసరిగా సమాధానం అందించాలని అన్నారు.

పారదర్శకత, జవాబుదారీతనం ప్రతి అధికారిలో ఉండాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులకు కూడా నిర్ణీత సమయంలో సమాధానాలు అందించాలని సూచించారు.

జిల్లా పరిపాలనలోని అధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని, అన్ని శాఖలు తమ పరిధిలోని ఫీల్డ్ సిబ్బంది హాజరు, పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా ప్రజలకు అందేలా శాఖాధిపతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

కొన్ని శాఖల్లో ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందన్న ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి శాఖాధికారి తమ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్రమం తప్పకుండా సమీక్షించి, ఉద్దేశపూర్వక జాప్యాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

కొంతమంది ఫీల్డ్ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, అవినీతిని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

త్వరలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు తమకు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా, నాణ్యమైన సమాచారంగా సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.