ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా మచిలీపట్నం రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్లాస్టిక్ కవర్ల వినియోగం రైతు బజార్లలో ఎక్కువగా ఉంటుందని వాటి నిర్మూలనకు యజమానులు సహకరించాలని కోరారు. మున్సిపల్ అధికారులు పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయని వివరించారు. తాగి పడేసిన కొబ్బరి బొండాల్లో దోమలు చేరి వ్యాధుల బారిన ప్రజలు పడే అవకాశం ఉందని తెలిపారు. మొక్కలను నాటడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. దేశ ప్రధాని మోదీ సైతం ఆయన తల్లి గారి పేరిట ఒక మొక్కను నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలను సంరక్షించకుండా నరికి వేయడం కారణంగా ఎండల తీవ్రత అధికమవుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే పారిశుద్ధ కార్మికులు ఇళ్ల వద్దకు వచ్చి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లోని డంపింగ్ యార్డులలో వాటిని వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా మొత్తం స్వచ్ఛతగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply