templetheft ఆలయంలో చోరీ..

templetheft ఆలయంలో చోరీ..
templetheft హుండీ ధ్వంసం… నగదు మాయం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
భద్రతపై భక్తుల ఆందోళన
ఆంధ్రప్రభ, పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం, రాత్రి వేళలో ఆలయం వద్ద ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా తీసుకున్న దుండగులు, ఆలయం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఆలయంలో ఉన్న హుండీని ధ్వంసం చేసి, అందులోని నగదును అపహరించారు.

చోరీ అనంతరం హుండీని ఆలయం బయటకు తీసుకెళ్లి పడేయడం గమనార్హం. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యం చూసి షాక్ కు గురయ్యారు. ఆలయం తాళం పగిలి ఉండటం, హుండీ ధ్వంసమైన స్థితిలో కనిపించడంతో వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై గౌడ సంఘం అధ్యక్షుడు భూషణవేన సురేష్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ సేకరణ, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భక్తి స్థలాలకే భద్రత లేకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో భద్రతా చర్యలు పెంచాలని, వారు కోరుతున్నారు.
ఈ ఘటనలో దుండగులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
