Rs.50 thousand | చనిపోతానంటూ.. సెల్ఫీ వీడియో..

Rs.50 thousand | చనిపోతానంటూ.. సెల్ఫీ వీడియో..

Rs.50 thousand | కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : తాను చేసిన నేరం నుండి తప్పించుకునేందుకు సూసైడ్ చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో తీసి భయాందోళనలకు గురి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి కేసు బారిన పడకుండా ఉండేందుకు సెల్ఫీ వీడియో తీసి.. పోలీసులపై ఆరోపణలు చేసి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని బెదిరింపులకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి ఉదంతమిది.. ప్రేమ వ్యవహారంలో యువతిని వేధించడంతోపాటు ఆమెకు కాబోయె భర్తను పిలిపించుకుని దాడి చేసి డబ్బులు, బైక్ లాక్కున్న కేసులో ఇరుక్కోకుండా ఉండేందుకు పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేసిన యువకుడిని పోలీసులు వెంటాడి మరీ పట్టుకున్నారు.

కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతితో రోమాలు ఉదయ్‌కు పరిచయం ఏర్పడింది. సెల్ నంబర్ తీసుకున్న ఉదయ్ తరుచూ మాట్లాడుతూ.. కొద్ది రోజుల తరువాత సదరు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఉదయ్ వేరే యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తున్న విషయం గురించి బాధితురాలు అడగడంతో అలాంటిదేమీ లేదని బుకాయించాడు.

అయితే బాధిత యువతి పని చేస్తున్న చోట తనతోపాటు పని చేస్తున్న మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించింది. తమ ఇంట్లోని పెద్దలకు ఈ విషయం చెప్పి వివాహం చేసుకోవాలనుకున్నారు. విషయం తెలిసిన ఉదయ్ గత జనవరి 18న బాధితురాలిని తన బైక్ పై తీగలగుట్టపల్లిలోని చంద్రపురి కాలనీకి తీసుకెళ్లి తన స్నేహితులతో బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాకుండా ఆమె పెళ్లి చె సుకోవాలనుకున్న యువకుడిని కూడా హెచ్చరించడంతోపాటు ఫోన్ చేసి అతన్ని పిలిపించాలని ఒత్తిడి చేశాడు. దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్తను అక్కడకు పిలిపించగా అప్పటికే కాపు కాసి ఉన్న ఉదయ్, అతని స్నేహితులు అతన్ని బెదిరించారు.

దీంతో భయాందోళనకు గురైన అతను అక్కడి నుండి వెళ్లిపోగా, అతని స్నేహితులను అడ్డుకుని రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించారు. వారి వద్ద ఉన్న బైక్ తోపాటు రూ. 2 వేలు వసూలు చేసుకున్న తరువాత వారిని వదిలేశారు. ఆ తరువాత ఉదయ్ బాధిత యువతిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో దింపి ఆమెకి కాబోయే భర్త దాడి చేశాడని ఫిర్యాదు చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలు తనపై ఉదయ్ దారుణంగా వ్యవహరించాడని, తనతోపాటు తనకు కాబోయే భర్తపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఉదయ్ సెల్ఫీ వీడియో ద్వారా కొంతమంది పేర్లు చెప్పడంతోపాటు చేయని తప్పుకు కేసు నమోదు చేసిన సీఐ బాధ్యులంటూ ఆరోపణలు చేశాడు. పురుగుల మందు తాగినట్టుగా వీడియోలో రికార్డ్ కాగా ఆ తరువాత ఉదయ్ ఆ చూకి లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఉదయ్ కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాంకేతికత సాయంతో ఉదయ్ కోసం ఆరా తీస్తున్న క్రమంలో శుక్రవారం ఆచూకి లభ్యమైంది. అతన్ని అదుపులోకి తీసుకుని శనివారం కోర్టులో హాజరు పరిచినట్టుగా సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నిందితుడు ఉదయ్ గతంలో వీణవంక, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయని వివరించారు. నేర చరిత్ర ఉన్న ఉదయ్ తనను తాను కాపాడుకునేందుకు ఈ ఘటనలో బాధితులను నిందితులుగా క్రియేట్ చేయడంతోపాటు పోలీసులపై లేని పోని ఆరోపణలు చేశాడని సీఐ తెలిపారు. వాస్తవంగా జరిగిన దానికి ఉదయ్ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు ఏ మాత్రం పొంతన లెదని స్పష్టం చేశారు. చట్టం నుండి తప్పించుకునేందుకు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నట్టుగా సెల్ఫీ వీడియోలు తీసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టయితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.