భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

మడకశిర, ఆంధ్రప్రభ: మడకశిర పట్టణంలోని శ్రీ శిరిడీ సాయిబాబా దేవాలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని శ్రీ శిరిడీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ గురువులు సమాజానికి జ్ఞానాన్ని అందించి ధర్మమార్గంలో నడిపించే మార్గదర్శకులని అన్నారు. గురుపౌర్ణమి ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం, సద్బుద్ధి, సేవాభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు గుండుమల తిప్పేస్వామిని శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.