యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి..
యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి..
- సొసైటీ గోదాం ముట్టడించిన రైతులు
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో సొసైటీ గోదామును ముట్టడించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. గోదాం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వినియోగం గ్రామీణ ప్రాంత రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. చాలామంది రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో యాప్ ద్వారా యూరియా పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని చిన్న, సన్నకారు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, యాప్ విధానం వల్ల రైతులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా “రైతు ఐక్యత వర్ధిల్లాలి”, “జై జవాన్ – జై కిసాన్” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధని శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
