నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తప్పవు

  • వ్యవసాయ అధికారి, ఎస్ఐ హెచ్చరిక

ధర్మపురి, ఆంధ్రప్రభ:
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మపురి వ్యవసాయ అధికారి రాజకుమార్, పట్టణ ఎస్సై జి. మహేష్ హెచ్చరించారు.

బుధవారం మండల టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో ధర్మపురి మండలంలోని పలు విత్తన దుకాణాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాల స్టాక్‌ను పరిశీలించి, అవి అధీకృత సంస్థల నుంచి వచ్చాయా లేదా అన్న విషయాన్ని ధృవీకరించారు. అలాగే సంబంధిత రసీదులను కూడా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజకుమార్ మాట్లాడుతూ డీలర్లు తప్పనిసరిగా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా వరి పంటలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాల విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

విత్తనాలను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని, కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్‌లను రోజువారీగా అప్‌డేట్ చేయాలని సూచించారు. ప్రతి దుకాణం ముందు విత్తనాల లభ్యత, ధరల బోర్డు ప్రదర్శించాలని చెప్పారు.

పత్తి విత్తనాలకు సంబంధించి బీజీ-3 విత్తనాల అక్రమ విక్రయం, లైసెన్స్ లేకుండా అమ్మకం, అధిక ధరలు వసూలు చేయడం లేదా నకిలీ విత్తనాల విక్రయం వంటి చర్యలు జరిగితే విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యూరియా నిల్వలను కూడా తనిఖీ చేసిన అధికారులు, ఈ వానకాలం సీజన్ నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. మండలంలో ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply