ఓటర్ల సవరణ దరఖాస్తులను పక్కాగా నమోదు చేయాలి
- నెన్నెల, ఆవడ జీపీలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య
నెన్నెల, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల భర్తీ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని నెన్నెల, ఆవడ గ్రామ పంచాయతీలను సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) వద్దకు వెళ్లి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ విధానాన్ని, వాటిని ఆన్‌లైన్ చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమై ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలు, బీఎల్ఏలు సహకరించాలన్నారు. పూర్తిగా నింపిన ఫారాలను వెంటనే బీఎల్ఓలకు అందజేయాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌ఐ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
