ఎన్టీఆర్ స్ఫూర్తి సజీవం.. ఏలూరులో ఘన నివాళులు

ఎన్టీఆర్ స్ఫూర్తి సజీవం.. ఏలూరులో ఘన నివాళులు
ఏలూరు, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయులని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు.
ఏలూరులోని 4వ క్లస్టర్ పరిధిలో అమీనా పేట జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, 10వ క్లస్టర్ పరిధిలో పద్మశాలీల ఫంక్షన్ హాల్ వద్ద, అలాగే 11వ క్లస్టర్ పరిధిలో చొడిదిబ్బ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హైబ్రిడ్ మహానాడు వేదికలపై గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మారడాని రంగారావు, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
