“28 నుంచి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేత..

“28 నుంచి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేత..

15 రోజుల పాటు మరమ్మత్తు పనులు”

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఘాట్ రోడ్‌ను ఈనెల 28 నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులు సుమారు 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయని తెలిపారు. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం ఈవో చాంబర్‌లో ఘాట్ రోడ్ మూసివేత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా, భద్రత, దర్శన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన డిప్యూటీ ఈవో బి.హెచ్.వి.ఎస్.ఎన్. కిషోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఘాట్ రోడ్డులో కొనసాగుతున్న ప్రోటోకాల్ ఆఫీసును కొండ దిగువన కనకదుర్గ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ భక్తుల రాకపోకల కోసం నిరంతరం ఉచిత బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు టికెట్ కౌంటర్ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్ ఆఫీసుకు మార్చడంతో పాటు, మహా మండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్లను నియమించారు. ప్రోటోకాల్ భక్తుల దర్శనాల కోసం మహా మండపం వద్ద ప్రత్యేక దర్శన కేంద్రం ఏర్పాటు చేశారు.

నిత్య పూజలు, సేవల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్ మూసివేతపై భక్తులకు అవగాహన కల్పించేందుకు మైక్ అనౌన్స్‌మెంట్లు కొనసాగుతాయని సూచించారు.

పార్కింగ్ కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రత్యేక స్థలం గుర్తించగా, సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ ప్రాంతాల నుంచి దేవస్థానం బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులకు మాత్రమే లిఫ్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తామని, మిగతా భక్తులు మహా మండపం మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలని ఈవో సూచించారు.

భక్తులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply