ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు
- తపస్ సమన్వయకర్త నర్సింగప్ప
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని కృషి చేస్తే ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని నారాయణపేట జిల్లా తపస్ సమన్వయకర్త దుంప నర్సింగప్ప అన్నారు. గురువారం ఊట్కూర్ మండలంలో ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను తపస్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి ఫలితాల్లో మండల ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి. పూజ (568 మార్కులు, జెడ్పీహెచ్‌ఎస్ చిన్నపోర్ల), జి. మహేష్ (556 మార్కులు, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల, ఊట్కూర్) ప్రతిభను ప్రశంసించారు.
విద్యార్థులు రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల్ని చిన్న వయసులో వివాహం చేయకుండా ప్రోత్సహిస్తే వారు మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలతో చదువుకుంటే వారి భవిష్యత్తు బంగారు మయం అవుతుందని అన్నారు.
పదో తరగతి అనంతరం తమకు నచ్చిన కోర్సులను ఎంచుకుని జీవితంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తపస్ కార్యదర్శి గోపాల్, కోశాధికారి రమేష్, నాయకులు తిరుపతి నాయక్, ప్రదీప్ యాదవ్, బన్నేష్, పృథ్వీరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
