ప్రేమ వివాహానికి అండగా నిలిచిన ఇద్దరి దారుణ హత్య

తిరుపతి (ఆంధ్రప్రభ): ప్రేమ జంటకు వివాహం జరిపించారనే కారణంతో ఇద్దరు వ్యక్తులను కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతి నగరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో గొల్లపల్లికి చెందిన, ప్రస్తుతం జీవకోనలో నివాసం ఉంటున్న మునిరత్నం యాదవ్ (40), సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ యాదవ్ (45) మృతిచెందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొద్ది నెలల క్రితం ఓ ప్రేమజంటకు మునిరత్నం యాదవ్, మణికంఠ యాదవ్ వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపం వద్దకు పిలిచారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకున్న వారిపై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి కత్తులతో దాడి చేశారు. ఘటనలో మునిరత్నం యాదవ్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠ ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగెత్తి రోడ్డుపైకి వచ్చాడు.

స్థానికులు మణికంఠను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న తిరుపతి నగర డీఎస్పీ భక్తవత్సలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.