విద్యుత్ తీగలకు పెనవేసుకున్న చెట్లు.. స్థానికుల ఆందోళన

వికారాబాద్ (ఆంధ్రప్రభ): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో గౌతమి కళాశాలకు వెళ్లే మార్గంలోని రామయ్యగూడ రోడ్డుకు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు చెట్లు, మొక్కలు పెనవేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని రెండు విద్యుత్ స్తంభాలపై కింది నుంచి పై వరకు పెరిగిన చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలను తాకే స్థాయికి చేరుకోవడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.

ఇటీవల తరచూ గాలివానలు కురుస్తుండటంతో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. గత వారం రోజులుగా తరచూ విద్యుత్ నిలిచిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాలకు పెనవేసుకున్న చెట్లు, కొమ్మలను తొలగించి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.