తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నందకం అతిథి గృహం నందు శుక్రవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతికి చెందిన శ్రీనివాసులు నాయుడు (58), ఆయన భార్య అరుణ (55) గురువారం తిరుమలకు వచ్చి నందకం అతిథి గృహంలో బస చేశారు. శ్రీవారి దర్శనానంతరం కాటేజీలో ఉన్నట్లు అక్కడ సిబ్బంది తెలిపారు.
ఉదయం నుంచి కాటేజీ తలుపులు తెరవకపోవడంతో పోలీసుల సహాయంతో కాటేజీ తలుపులను బద్దలు కొట్టడంతో దంపతులు ఇరువురు, ఫ్యాన్లకు ఉరివేసుకొని విగత జీవులైనారు. శ్రీనివాసులు నాయుడు పుత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ తగాదాల కారణంగా వీరిరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. టీటీడీ విజిలెన్స్ పోలీసు సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకు పంపారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.
