గూర్రెవుల గ్రామాన్ని వెంటాడుతున్న సమస్యలు..
కన్నాయిగూడెం (ఆంధ్రప్రభ): మండలంలోని గూర్రెవుల గ్రామంలో మౌలిక వసతుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడం, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడం, పారిశుద్ధ్య లోపంతో దుర్వాసన వెదజల్లడం, దోమల బెడద పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
గ్రామ సమస్యలను పలుమార్లు సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గ్రామ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాపోయారు. వెంటనే అధికారులు గ్రామాన్ని సందర్శించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణను సంప్రదించగా, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, మురుగు నీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. సమస్యలను పరిశీలించి దశలవారీగా పరిష్కరిస్తామని, గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
