శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలి

అధికమాసంలో రెండు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష

తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ: అధికమాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో రెండు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో నిర్దేశిత గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం తిరుపతి జేఈవో ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న అంకురార్పణ, సెప్టెంబర్ 15న ధ్వజారోహణం, సెప్టెంబర్ 19న గరుడవాహనం, సెప్టెంబర్ 22న రథోత్సవం, సెప్టెంబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతలకు కూడా ప్రత్యేక దర్శనాలు ఉండవని వెల్లడించారు.

విజిలెన్స్, పోలీసు శాఖల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ మ్యాప్‌లు, పార్కింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దర్శన క్యూలైన్లు, మాడవీధులు, గ్యాలరీలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో అన్నప్రసాదాల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని, గ్యాలరీల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని తెలిపారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూల నిల్వలు కూడా సమృద్ధిగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, శ్రీభాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జీఎల్‌ఎన్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.