మే 1 డెడ్‌లైన్‌తో ట్రంప్ పై ఒత్తిడి

మే 1 డెడ్‌లైన్‌తో ట్రంప్ పై ఒత్తిడి
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ మొదలై రెండు నెలలు గడిచాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ హార్ముజ్ జలసంధి దిగ్బంధంలోనే ఉంది. చమురు సంక్షోభం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. పరస్పర హెచ్చరికలు, ప్రతి హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టే అనిపిస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన మాత్రం కొనసాగుతోంది. ఎవరికివారే గెలుపు ప్రకటించుకుంటూ, తమ పంతం నెగ్గించుకోవాలనే మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కంటే అమెరికానే ఎక్కువగా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ యుద్ధ అధికారాల చట్టం (వార్ పవర్స్ యాక్ట్) చెక్ పెట్టనుంది. యూఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించినందున, ఈ చట్టం ప్రకారం మే 1 నాటికి ఇరాన్‌పై సైనిక చర్యను ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డైలమాలో పడ్డారు. ముందుకెళ్లాలా? వెనక్కి తగ్గాలా? అన్న కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఆయన ముందున్నవి మూడే మార్గాలు.
ఒకటి ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం. రెండవది యుద్ధం కొనసాగించడానికి కాంగ్రెస్ ఆమోదం పొందడం. మూడవది వార్ పవర్స్ యాక్ట్‌ను అతిక్రమించి యుద్ధాన్ని కొనసాగించడం. ఇందులో మూడవది అత్యంత సంక్లిష్టమైనది. ఇది ట్రంప్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే అవకాశం ఉంది.
వార్ పవర్స్ యాక్ట్ అంటే ఏమిటి?
ఏదైనా దేశంపై యుద్ధానికి దిగాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధాన్ని ప్రారంభిస్తే, గరిష్టంగా 60 రోజులు మాత్రమే కొనసాగించవచ్చు. అనంతరం యుద్ధాన్ని ముగించాలి లేదా కాంగ్రెస్ ఆమోదం పొందాలి.
ఇరాన్ విషయంలో ట్రంప్‌కు ఇదే చిక్కుముడిగా మారింది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై యుద్ధ చర్యలు ప్రారంభమయ్యాయి. మార్చి 1న కాంగ్రెస్‌కు అధికారిక సమాచారం అందించారు. ఆ రోజు నుంచి 60 రోజుల గడువు లెక్కించగా, మే 1తో అది ముగుస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ముందుకెళ్లడం సాధ్యమేనా?
ఈ పరిస్థితుల్లో ట్రంప్ సైనిక చర్యకు 30 రోజుల పొడిగింపును కోరగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో, డెమోక్రటిక్ పార్టీ కూడా ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ నుంచి ఆమోదం పొందడం సులభం కాదు.
అయితే గతంలో బరాక్ ఒబామా సహా కొంతమంది అధ్యక్షులు ఈ నిబంధనను కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ఇటీవల మూడు నుంచి ఐదు రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు కూడా ముగియబోతోంది. దీంతో పరిస్థితి ఇరాన్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక క్లిష్ట దశలో చిక్కుకున్నారు.

1..2..3.. ట్రంప్ ఎటువైపు?
1. శాంతి ఒప్పందం
అమెరికా, ఇరాన్ దేశాలు దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే, ఇరువైపులా విజయం ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ట్రంప్ యుద్ధ ఒత్తిడి నుంచి బయటపడగలరు. సైన్యాన్ని వెనక్కి తీసుకువచ్చి, దేశాన్ని దీర్ఘకాలిక యుద్ధంలోకి నెట్టలేదన్న పాజిటివ్ ఇమేజ్ను కాపాడుకోవచ్చు.
2. యుద్ధం పొడిగింపు
చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని హార్ముజ్ దిగ్బంధాన్ని కొనసాగిస్తూ, యుద్ధాన్ని మరింత కాలం పొడిగించే ప్రయత్నం చేయవచ్చు. కాంగ్రెస్ ఆమోదంతో సైనిక చర్యలను విస్తరించే అవకాశం ఉంది.
3. సందిగ్ధం
మే 1 గడువు ముగిసినా పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించడం మరో మార్గం. అయితే ఇది చట్టపరమైన సంక్షోభంకు దారితీస్తుంది. కాంగ్రెస్, వైట్ హౌస్ మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ట్రంప్‌కు రాజకీయ సవాళ్లు తీసుకురాగలదు.
