యువతతో మోదీ సరదా ఫుట్‌బాల్

యువతతో మోదీ సరదా ఫుట్‌బాల్

గ్యాంగ్ టక్ : బుధవారం కీలకమైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రెండవ దశ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు రాష్ట్రం సిక్కింలో మంగళవారం యువకులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. సోమవారం సాయంత్రం వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన, మంగళవారం గ్యాంగ్టక్‌లో యువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. బెంగాల్‌లోని వేడి, తేమతో కూడిన వాతావరణం నుంచి సిక్కింకు చేరుకున్న ఆయన, తన సాధారణ కుర్తాకు బదులుగా ట్రాక్ ప్యాంట్లు, ఫుట్‌బాల్ షూస్ ధరించి భిన్నంగా కనిపించారు.

ఎక్స్‌లో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ, యువకులతో గడిపిన ఈ ఫుట్‌బాల్ సెషన్‌ను “ఉత్తేజకరమైన అనుభవం”గా ప్రధాని మోదీ అభివర్ణించారు. అలాగే ఫేస్‌బుక్‌లో ఫోటోలను షేర్ చేస్తూ, “సిక్కింలోని గ్యాంగ్టక్‌లో ఒక అందమైన ఉదయం నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడటం కంటే గొప్పది మరొకటి లేదు” అని పేర్కొన్నారు. ఈ ఫోటోలలో 75 ఏళ్ల ప్రధానమంత్రి వార్మ్‌అప్ చేస్తూ, యువ క్రీడాకారులతో డ్రిబ్లింగ్ చేస్తూ, పిల్లలతో సరదాగా గడుపుతూ కనిపించారు. బంతిని తన్నుతూ, గోల్ వైపు షాట్ కొడుతూ కూడా ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.

బెంగాల్‌కు సందేశమా?
సిక్కింలో ప్రధానమంత్రి ఆడిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ రాజకీయ ఎత్తుగడగా, బెంగాల్ ప్రజలకు ఒక సందేశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిక్కిం పొరుగు రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్‌లో ఫుట్‌బాల్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ఉంది. బెంగాల్ రెండవ దశ పోలింగ్‌కు ముందు ప్రధాని వ్యూహాత్మకంగా ఫుట్‌బాల్ ఆడినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానం దృష్ట్యా బెంగాల్ ప్రజలకు ఇది ఒక ప్రత్యేక సంకేతంగా భావిస్తున్నారు.

2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్‌లో జరిగిన ఒక ర్యాలీలో ‘ఖేలా హోబే’ (ఆడుకోవాలి) అనే నినాదంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీల్‌చైర్‌లో కూర్చుని ఫుట్‌బాల్ విసిరిన దృశ్యం గుర్తుండే ఉంటుంది. ఆ నినాదం టీఎంసీకి మంచి ఊపునిచ్చింది.

Leave a Reply