నల్గొండను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నల్గొండను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ, ఆంధ్రప్రభ : రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు.

నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకు వస్తుందని, ఒకప్పుడు జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగేదని, అయితే వివిధ కారణాలతో ప్రస్తుతం అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, వరి పంటపైనే ఆధారపడకుండా బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
పంట మార్పిడిని తప్పనిసరిగా పాటించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నదని, ముఖ్యంగా సన్నధాన్యం పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నదని తెలిపారు.
బత్తాయి సాగుకు పేరుగాంచిన నల్గొండ జిల్లాలో తిరిగి విస్తృత స్థాయిలో సాగు పెరగాల్సిన అవసరం ఉందని, ఆరోగ్య పరంగా కూడా బత్తాయి ఎంతో ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. ఉద్యాన పంటల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.
అవసరమైతే హైదరాబాద్‌లో మరోసారి సమావేశం నిర్వహించి సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఎగుమతులపై సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బత్తాయిలో అనేక కొత్త రకాల వంగడాలు అందుబాటులోకి వచ్చాయని, అవి రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. నల్గొండ బత్తాయికి ప్రత్యేక గుర్తింపు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రుణ సదుపాయాలు వంటి పథకాల ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు.
అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డి. రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు, ఉద్యాన శాఖ అధికారులు, వివిధ జిల్లాల అధికారులు, అభ్యుదయ రైతులు, బత్తాయి రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యవసాయ, ఉద్యాన స్టాళ్లను మంత్రి ప్రారంభించారు.
