ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ఎప్పుడో?

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ఎప్పుడో?

హామీలు వెంటనే నెరవేర్చాలి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు విమర్శించారు.

ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్ టి. గోపాల్ రావు, జిల్లా సహాధ్యక్షులు మల్లెల పుల్లయ్య పేర్కొన్నారు.

బుధవారం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ కమిషన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తక్షణమే వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా మారిన వివిధ యాప్‌లను రద్దు చేసి, ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకే పరిమితం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో పవన్ కుమార్, మానపాటి రవి, నగిరి వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, కాశీం సాహెబ్, జయరాం, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply