ఎనిమిది నెలలుగా జీతాలు లేవు

  • కలెక్టర్‌ తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలి
  • సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ సుధాకర్

మైలవరం, ఆంధ్రప్రభ: మైలవరం మండలం చండ్రగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాప్‌ వర్కర్లకు సైతం పది నెలలుగా జీతాలు చెల్లించలేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ.. జూలై 30న జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో భాగంగా మైలవరం మండలంలోని పెండింగ్‌ వేతనాల సమస్యను జిల్లా కలెక్టర్‌, డీఆర్‌ఓ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వినతిపత్రాలు అందజేసి వారం రోజులు గడుస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు.

నెలల తరబడి వేతనాలు అందకపోతే కార్మికుల కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.సోమవారం నాటికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు శ్రీను, విద్యార్థి సంఘం నాయకుడు అనిల్‌, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.