వెల్డి గ్రామం ఐక్యతకు నిదర్శనం

వెల్డి గ్రామం ఐక్యతకు నిదర్శనం

  • గాయపడిన మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం
  • అండగా నిలిచిన గ్రామస్తులు
  • మన ఊరు ఒక కుటుంబం అని మరోసారి నిరూపణ

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్డి గ్రామం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ప్రజల మధ్య ఉన్న ఆప్యాయత, ఐక్యత. కష్టకాలంలో ఎవరూ ఒంటరిగా ఉండకుండా, ఒక కుటుంబంలా కలిసి నిలబడటం ఈగ్రామం ప్రత్యేకత. తాజాగా మరోసారి అదే ఐక్యతను వెల్డి ప్రజలు చూపించారు.

కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన క్రీడాకారుడు అల్ల మధు తల్లి ఆళ్ల రేణుక కోతులను కొట్టె క్రమంలో ఇంటిపై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరగడంతో చికిత్స కోసం భారీ ఖర్చులు అవసరమయ్యాయి. ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్న కుటుంబం ఈఖర్చులను భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు స్పందించి, గ్రామ వాట్సాప్ ద్వారా తమ వంతు సహాయంగా ముందుకు వచ్చారు.

గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు కలిసి విరాళాలు సేకరించి మొత్తం రూ.1,05,850 (ఒక లక్ష అయిదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) నగదును ఆళ్ల రేణుక కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మన ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా అది అందరి సమస్యే అని తెలిపారు. వెల్డి గ్రామం ప్రజల ఈసహాయస్ఫూర్తి, ఐక్యత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.