Cockroach Janata Party | వైరల్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’

Cockroach Janata Party | వైరల్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’
Cockroach Janata Party | డిజిటల్ యుగంలో కొత్త తరహా నిరసన
యువత అసంతృప్తికి సోషల్ మీడియా వేదిక
కాక్రోచ్ రూపకం వెనుక ప్రతీకాత్మకత
ప్రజాస్వామ్యంలో డిజిటల్ ఉద్యమాల ప్రభావం
Cockroach Janata Party | డిజిటల్ యుగంలో రాజకీయ, సామాజిక నిరసనలకు కొత్త రూపాలు పుడుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై పెరుగుతున్న విమర్శలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరుగుతున్న చర్చల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక అపూర్వమైన, ఊహించని నవ నిరసన ఉద్భవించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వైరల్ అయిన “కాక్రోచ్ జనతా పార్టీ” అనే వ్యంగ్యాత్మక ఉద్యమం అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి చెందిన చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలో, యువతను ఉద్దేశించి మీడియా ప్రచురించిన కొన్ని పదాలు వారి మనసుల్లో అసంతృప్తిని, ఆవేదనను రేకెత్తించాయి. సమాజంలోని ఒక వర్గం తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రశ్నించే హక్కును చాటడానికి ఒక వినూత్న డిజిటల్ శైలిని ఎంచుకుంది. రాజకీయ ప్రక్రియల్లో తమ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావించే కొందరు యువతలో ఈ వేదిక చర్చకు దారితీసింది. సాంప్రదాయ రాజకీయ ప్రక్రియలపై అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న యువతకు ఇది ఒక కొత్త డిజిటల్ వ్యక్తీకరణగా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అసంతృప్తి వైరల్ అయితే అధికారానికి వినిపిస్తుందా?
వైరల్ ఉద్యమ విజయాన్ని కేవలం సోషల్ మీడియా వినోదంగా కొట్టిపారేయలేం. బోస్టన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్న అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, వివిధ మీడియా నివేదికల ప్రకారం, కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 15 మిలియన్ల (కోటిన్నర) ఫాలోవర్లను ఆకర్షించి సోషల్ మీడియా చరిత్రలో ఒక సంచలనంగా నిలిచింది. ప్రధాన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ వేదిక నిరుద్యోగం, విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణపై వివాదాలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ వ్యవస్థలపై అవిశ్వాసం వంటి అంశాలను వ్యంగ్య శైలిలో ప్రస్తావించడం వల్ల విశేష ఆదరణ పొందింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష పార్టీలు, పౌర సంఘాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రాజస్థాన్‌లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వంటి సంఘటనలు యువతలో ఆందోళనలను పెంచాయి. ఈ అంశాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరగగా, సంప్రదాయ మీడియా కవరేజ్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో, ఈ ఉద్యమానికి సంబంధించిన ట్విట్టర్ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేకపోవడం మరింత చర్చకు దారితీసింది.

కాక్రోచ్ రూపకం వెనుక ప్రతీకాత్మకత.. అనుకూలన సామర్థ్యానికి నిదర్శనం
ఈ ఉద్యమానికి “కాక్రోచ్” (బొద్దింక) అనే రూపకాన్ని ఎంచుకోవడంలోనూ ఒక బలమైన ప్రతీకాత్మకత కనిపిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం బొద్దింకలు అత్యంత అనుకూలన సామర్థ్యం కలిగిన జీవుల్లో ఒకటి. అనేక రకాల కీటకనాశక మందులపై అవి అద్భుతమైన ప్రతిరోధకతను అభివృద్ధి చేసుకున్నాయని అంతర్జాతీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా మనుగడ కోసం మార్గాలు వెతుక్కునే ఈ జీవి, సమాజంలో అణగారిన లేదా నిర్లక్ష్యానికి గురైన వర్గాల భావోద్వేగాలకు ఒక రూపకంగా నిలవడం యాదృచ్ఛికం కాదు. అయితే ఈ పోలికను శాస్త్రీయ వాస్తవంగా కాకుండా సామాజిక సంకేతంగా చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వరం కూడా నిరోధాలను ఎదుర్కొన్నప్పుడు కొత్త రూపాల్లో వ్యక్తమవుతుందనే భావన ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. వివిధ నిరోధాలు, పరిమితులను ఎదుర్కొంటూ కూడా మనుగడ సాగించే ఈ జీవిలాగే, నేటి యువత కూడా తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నిలబెట్టుకోవడానికి ఇదొక మార్గంగా ఎంచుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సద్విమర్శలు-వివిధ భావజాలాల ప్రభావంపై చర్చ!
ఏదైనా సామాజిక లేదా రాజకీయ ఉద్యమం ఊపందుకున్నప్పుడు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను, నిష్పాక్షికతను బేరీజు వేయడం బాధ్యతాయుతమైన పత్రికా రంగం యొక్క కనీస ధర్మం. గతంలో ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమం రాజకీయ పరిణామాలకు దారితీసినట్లే, ఈ డిజిటల్ ఉద్యమంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యమం పూర్తిగా స్వతంత్ర పౌర చొరవా, లేక వివిధ రాజకీయ భావజాలాల ప్రభావం కూడా ఉందా అనే చర్చలు కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అదే సమయంలో, రాజస్థాన్‌లో పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ చేపట్టిన ప్రత్యక్ష నిరసనలకు లభించని ప్రచారం, ఒక వర్చువల్ పార్టీకి లభించడం వెనుక ఉన్న వ్యత్యాసాన్ని కూడా గమనించాలి. రాజకీయ పోరాటం అంటే కేవలం డిజిటల్ తెరలపై రీల్స్, రాప్ సాంగ్స్ సృష్టించడం మాత్రమే కాదు, డిజిటల్ ప్రచారం ఎంత ప్రభావవంతమైనదైనా, ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో జరిగే ఉద్యమాలకు అది పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సంకేతాలను అర్థం చేసుకోవడమే ప్రజాస్వామ్య బలం!
సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం, ట్రెండ్లను నియంత్రించడం లేదా వ్యంగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా అసలు సమస్యలు మాయమవ్వవు. సాంకేతికత ఎంతగా ఎదిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ శ్రమను భర్తీ చేస్తున్నా, ప్రజాస్వామ్య స్పూర్తిని మాత్రం ఏ శక్తీ భర్తీ చేయలేదు. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆందోళనలకు సరైన స్పందన లభించకపోతే కొత్త నిరసన రూపాలు ఉద్భవించే అవకాశం ఉంటుంది. యువత ఉపాధి అవకాశాలు, విద్యా వ్యవస్థపై నమ్మకం, పాలనా వ్యవస్థల పారదర్శకత, ప్రజా సేవల నాణ్యత వంటి అంశాలపై గంభీరమైన చర్చ జరగాలి. “స్క్రీన్‌పై కాక్రోచ్” అనేది కేవలం ఒక వైరల్ చిహ్నం మాత్రమే కావచ్చు, కానీ “సిస్టమ్‌లో కలకలం” అనేది సమాజం తన భావాలను వ్యక్తపరచడానికి కొత్త మార్గాలను వెతుక్కుంటోందనే సూచన. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఈ సంకేతాలను అణచివేయడం కాదు; అర్థం చేసుకోవడం, చర్చించడం, పరిష్కార మార్గాలను అన్వేషించడమే నిజమైన బలమైన పాలనకు సూచిక. అంతిమంగా, ప్రజల ప్రశ్నలను వినగల సామర్థ్యం ఉన్న వ్యవస్థలే కాలపరీక్షను తట్టుకుని నిలుస్తాయి. ప్రజాస్వామ్య పౌరస్ఫూర్తియే వాటికి నిజమైన బలం.
ఫిరోజ్ ఖాన్
9640466464
