సమస్యల పరిష్కారమే లక్ష్యం : చైర్పర్సన్ అనన్య
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య పేర్కొన్నారు.
బుధవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఆలంపల్లిలో పర్యటించిన ఆమె, వార్డులో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓపెన్ డ్రైన్లు, రోడ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించారు.
మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నీటి వృథా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
