Telangana SIR | సర్‌పై పార్టీల ప్రత్యేక దృష్టి

Telangana SIR | సర్‌పై పార్టీల ప్రత్యేక దృష్టి

Telangana SIR | కొత్త ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీల పోటీ
మొదటిసారి ఓటర్లే వచ్చే ఎన్నికల్లో కీలకం

Telangana SIR | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల వ్యవధి ఉన్నా, అధికార పార్టీ కాంగ్రెస్, విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటి నుంచే అధికారంలోకి వచ్చేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇందుకు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలను నియమించి కీలక బాధ్యతలను అప్పగించాయి. సర్‌పై పార్టీ నాయకులు, శ్రేణులకు అవగాహన కల్పించేందుకు పార్టీలన్నీ శిక్షణా తరగతులను నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆధ్వర్యంలో గత శనివారం కీలక సమావేశం నిర్వహించింది. సర్‌పై పార్టీ పరంగా చేయవలసిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సీనియర్ నేతను ఇంచార్జ్‌గా నియమించి సర్‌ను పర్యవేక్షించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ పేరుతో లక్షలాది ఓట్లను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలగించడం వల్లే అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమిళనాడులో కూడా ఇదే జరిగిందని గుర్తు చేస్తోంది. నకిలీ ఓటర్ల పేరుతో ఉన్న ఓటర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని, పోలింగ్ బూత్ ఇంచార్జ్‌లు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని పీసీసీ నాయకత్వం జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలను ఆదేశించింది.

ఒక అడుగు ముందే ఉన్న బీఆర్ఎస్

సర్ అంశంలో బీఆర్ఎస్ అన్ని పార్టీలకన్నా ముందంజలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సర్‌పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ వారిని అప్రమత్తం చేస్తోంది. సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరై పార్టీ శ్రేణులకు సర్ వల్ల జరిగే ప్రమాదాన్ని, భవిష్యత్తులో జరిగే పరిణామాలను వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్‌పై శిక్షణా తరగతులకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది.

సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించిన సర్ అవగాహనా సదస్సులను ఇప్పటివరకు ఎల్బీ నగర్, అంబర్‌పేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలుత సర్‌పై పార్టీ శ్రేణులకు అవగాహనా కార్యక్రమాలను పూర్తి చేసి, ఆ తర్వాత జిల్లాల్లో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించింది.

యువతరంగంపై దృష్టి

లక్షల సంఖ్యలో యువ ఓటర్లు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించడంతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి లక్షల సంఖ్యలో కొత్త ఓటర్లు ఎన్నికల జాబితాలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో పెద్ద భాగం తొలిసారి ఓటు హక్కు వినియోగించబోతున్నారు. అందుకే పార్టీల దృష్టి ఇప్పుడు కేవలం ప్రచారంపై కాదు, ఓటరు జాబితాలో పేర్లు చేర్పించడంపైనే కేంద్రీకృతమవుతోంది.

తెలంగాణలో ప్రత్యేక ఓరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 25 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇంటింటి సర్వే, కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు ఈ ప్రక్రియలో భాగం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల యువతీ యువకుల్లో మంచి క్రేజ్ ఉందని, అందుకే యువతరంగ్‌కు సర్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ తెలంగాణ నాయకత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పాతబస్తీలో భారీగా దొంగ ఓటర్లున్నారని, సర్ ప్రక్రియలో ఆ ఓట్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. నూతన ఓటర్ల నమోదులో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించి పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సర్‌పై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ సైతం కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కవిత, అధిక సంఖ్యలో కొత్త ఓటర్లను చేర్పించేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది. ఇందుకు కమిటీలను నియమించే పనిలో పార్టీ అధినేత్రి కవిత దృష్టి సారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయంగా కీలకం కానున్న కొత్త ఓటర్లు

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా ఒక శాతం మాత్రమే. అనేక నియోజకవర్గాల్లో కొన్ని వేల ఓట్లే ఫలితాన్ని తారుమారు చేశాయి. అంటే వచ్చే ఎన్నికల్లో కొత్తగా నమోదయ్యే యువ ఓటర్లు కొన్ని కీలక స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితికి చేరవచ్చు. రాజకీయ వ్యూహకర్తల లెక్కల ప్రకారం, తొలిసారి ఓటు వేసే యువతకు స్థిరమైన పార్టీ అనుబంధం తక్కువ ఉంటుందని చెబుతున్నారు.

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుల, ప్రాంతీయ భావోద్వేగాల కంటే ఉపాధి, విద్య, అవకాశాలపై దృష్టి ఎక్కువ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి దశలో అభిప్రాయం మార్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని అంచనా. అందుకే కొత్త ఓటర్లను నమోదు చేయించుకోవడం అంటే కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు, భవిష్యత్ ఓటు బ్యాంక్‌ను నిర్మించుకోవడం అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

సర్ కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా?

ప్రభుత్వ పనితీరు, కొత్త ఓటర్ల ఆకర్షణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తున్నామని ప్రకటించారు. యువతను ఆకర్షించేందుకు ఉద్యోగాలు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను కాంగ్రెస్ ముందుకు తెస్తోంది.

కొత్త ఓటరు నమోదు శిబిరాలు, నిరుద్యోగ యువతతో ప్రత్యక్ష సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, ఉద్యోగ నియామకాల పురోగతిని ప్రచార అజెండాగా మార్చడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కొత్త ఓటర్లను ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిందన్న భావనతో కలుపుకోవడం అని చెబుతున్నారు.

పటిష్ట వ్యూహంతో బీఆర్ఎస్!

బూత్ స్థాయిలో డిజిటల్ పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌కు కొత్త ఓటర్ల నమోదు మరింత కీలకంగా మారింది. ఎందుకంటే 2023 ఎన్నికల తర్వాత పార్టీ ముందున్న పెద్ద సవాలు యువతలో మద్దతును తిరిగి పొందడం. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు.

35 వేలకుపైగా పోలింగ్ బూత్‌ల వద్ద డిజిటల్ సభ్యత్వ నమోదు, కేడర్ శిక్షణపై పార్టీ దృష్టి పెట్టింది. పాత ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం, యువ ఓటర్లను తిరిగి ఆకర్షించడం, ఓటరు జాబితాల్లో పేర్లు తొలగిపోకుండా బూత్ స్థాయిలో పర్యవేక్షణ, హైదరాబాద్, పట్టణ ప్రాంతాల్లో తిరిగి బలం పెంచుకోవడం బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.

కేటీఆర్ ఇప్పటికే ఓటరు జాబితా సవరణల సమయంలో బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీనిని బట్టి బీఆర్ఎస్ ఎన్నికల పోరాటాన్ని ఇప్పటి నుంచే ఓటరు జాబితాల దశలో ప్రారంభించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొదటిసారి ఓటర్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి?

తెలంగాణలో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ పరిమితంగానే ఉన్నప్పటికీ, కొత్త ఓటర్లలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉద్యోగార్థులు, పట్టణ యువత, డిజిటల్ మీడియా వినియోగదారుల వర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇటీవల యువత బీజేపీ వైపు ఆకర్షితమవుతోందని ప్రకటించింది.

దేశవ్యాప్తంగా బీజేపీ గతంలో ఒక బూత్, పది మంది యువకులు తరహా యువత నమోదు కార్యక్రమాలు చేపట్టిన అనుభవం కూడా కలిగి ఉంది. మొదటిసారి ఓటర్లపై ప్రత్యేక ప్రచారం, డిజిటల్ సభ్యత్వ నమోదు, కాలేజీ క్యాంపస్‌లపై దృష్టి, జాతీయ అంశాలతో యువతను ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply