ADB| చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం… ఎమ్మెల్యే బోజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 2 (ఆంధ్రప్రభ) : వేసవిలో ఎండల తీవ్రత వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రజలు దప్పిక తీర్చుకునేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యమ‌ని, అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గంగన్నపేటలోని ప్రధాన రోడ్డు పక్కన కీ.శే. కొత్తపెళ్లి లక్ష్మీ చిన్నయ్య, కొత్తపెళ్లి కుమార్ నరేందర్ జ్ఞాపకార్థం కొత్తపెళ్లి మహేందర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ పాల్గొని కీ.శే. లక్ష్మీ నరసయ్య, నరేందర్ చిత్రపటాలకు పూల‌మాల‌ల‌తో నివాళులర్పించి అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రతి ఏడాది వేసవిలో వారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యక్రమమ‌ని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ ఏడాది వేసవి ఎండలు అధికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తీవ్రంగా ఉన్న‌ ఎండలో తిరగకుండా ఉండాలని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం కొత్తపెళ్లి మహేందర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు, పాల్గొన్న నాయకులకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యులు దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంతరావు, ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాధాబాయి, లక్కారం దంతన్ పెళ్లి మాజీ సర్పంచ్ లు మరసుకోల తిరుపతి, భీమన్న, కాంగ్రెస్ నాయకులు హజీముద్దీన్ హైహ్మద్, కొత్తపెళ్లి మహేందర్, బిరుదుల లాజర్, సుశీల్ కుమార్, కొత్తపెళ్లి గ0గేష్, రాజేష్ జాదవ్, జావిద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply