మీ ప్రేమకి థ్యాంక్స్‌.. ఫ్యాన్స్‌ కోసం ఎన్టీఆర్‌ ట్వీట్‌

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. భుజానికి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు చికిత్స అందించిన కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి జూనియర్ ఎన్టీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు అందించిన ప్రత్యేక శ్రద్ధ, సహకారం ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు.

తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రేమతో ప్రార్థించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ఆదరణ తనకు ఎంతో బలాన్ని ఇస్తుందని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. “మీ అభిమానానికి, ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మిమ్మల్ని కలుస్తాను” అని జూనియర్ ఎన్టీఆర్‌ తన సందేశంలో తెలిపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారని, వైద్యుల సూచనల మేరకు చికిత్స అనంతర జాగ్రత్తలు పాటిస్తున్నారని సమాచారం. త్వరలోనే అభిమానులు, సినీ వర్గాలను కలుస్తానని ఆయన వెల్లడించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.