డ్రగ్స్‌ వద్దు.. ఆరోగ్యం ముద్దు..

  • విద్యార్థుల చేతుల్లో పుస్తకాలుండాలి.. మాదకద్రవ్యాలు కాదు
  • సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కొద్దని అవగాహన ర్యాలీ

విజయవాడ, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంజ్‌ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ మాల్‌ నుంచి పాలిటెక్నిక్‌ కళాశాల వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

‘డ్రగ్స్‌ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో’, ‘విద్యార్థులారా.. సైబర్‌ నేరగాళ్ల చిక్కుల్లో పడకండి’ వంటి నినాదాలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, సైబర్‌ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు, మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనేపూడి శంకర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్‌ మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న లక్నోలో ఏర్పాటైన ఏఐఎస్‌ఎఫ్‌ దేశంలో తొలి జాతీయ విద్యార్థి సంఘమని తెలిపారు.

స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కులు, విద్యా పరిరక్షణ కోసం సంఘం పోరాడుతోందన్నారు. ‘చదువు–పోరాటం’ నినాదంతో విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం విద్యా వ్యాపారీకరణ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి అందరికీ సమాన, ఉచిత, శాస్త్రీయ విద్య అందించాలని డిమాండ్‌ చేశారు.

ఫీజుల నియంత్రణ, హాస్టల్‌ వసతులు, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడం వంటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్‌ఎఫ్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

మాదకద్రవ్యాల వ్యాప్తి విద్యార్థులు, యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తోందని పేర్కొంటూ.. డ్రగ్స్‌, గంజాయి, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, ఆన్‌లైన్‌ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను వారు అభినందించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై చైతన్యవంతులను చేసేందుకు ఏఐఎస్‌ఎఫ్‌ తనవంతు కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.