Tamil Nadu | డీలిమిటేషన్‌కు నో ..!

543 లోక్‌సభ స్థానాలు యథాతథంగా ఉంచాలని డిమాండ్‌..
మహిళా రిజర్వేషన్‌ వెంటనే అమలు చేయాలని తీర్మానం


Tamil Nadu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీలిమిటేషన్‌ అంశంపై తమిళనాడు అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ.. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. జనాభా ప్రాతిపదికన స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని తీర్మానంలో పేర్కొంది. అయితే మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌ ప్రక్రియతో ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ వల్ల రాజకీయంగా నష్టం కలగకూడదని తీర్మానంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రం దృష్టికి తమ అభిప్రాయాన్ని తీసుకెళ్లింది.