Breaking | సాయికృష్ణ కేసులో హోంగార్డుకు రిమాండ్
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హోంగార్డు వెంకటరాజును అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు వెంకటరాజును రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సాయికృష్ణను తీసుకొచ్చిన సమయంలోని సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్‌ను ధ్వంసం చేసినట్లు హోంగార్డు వెంకటరాజుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు ఆధారాల సేకరణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసుల పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా హోంగార్డు అరెస్ట్ కావడంతో కేసు విచారణలో ఇది కీలక పరిణామంగా మారింది. సిట్ అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
