డీఎస్సీ టీచర్లను అవమానించేలా జగన్‌ కుట్రలు

  • 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన లోకేశ్‌
  • చూసి ఓర్వలేక విషప్రచారం
  • ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదు?
  • అమరావతి అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ నేతలకు కడుపుమంట
  • మాజీ ముఖ్యమంత్రిపై దేవినేని ఉమా ఫైర్‌

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: డీఎస్సీలో అర్హత సాధించిన పేద, మధ్యతరగతి నిరుద్యోగ ఉపాధ్యాయులను అవమానించేలా వైసీపీ అధినేత జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏళ్ల తరబడి కష్టపడి డీఎస్సీ సాధించిన నిరుద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘జాబ్‌ క్యాలెండర్‌’ పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఉమా ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన మంత్రి నారా లోకేశ్‌ను చూసి ఓర్వలేకే వైసీపీ విషప్రచారానికి దిగుతోందని అన్నారు. మండలిని రద్దు చేస్తానని గతంలో చెప్పిన జగన్‌రెడ్డి ఇప్పుడు మండలి సమావేశాలకు వెళ్తూ శాసనసభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రావడానికి ఆయన భయపడుతున్నారని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల లీకేజీ, ల్యాండ్‌, ఇసుక, మద్యం, గనుల వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే సభకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, స్టీల్‌ బ్రిడ్జి వంటి కీలక నిర్మాణాలను పూర్తి చేసిందని ఉమా తెలిపారు. అమరావతిని దేశం గర్వించేలా ‘న భూతో న భవిష్యత్‌’ అన్న రీతిలో ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

అమరావతి అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా గురువారం సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోని వైసీపీ నేతలు, ఇప్పుడు రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారని అన్నారు. చనిపోయిన వారిని పరామర్శించకుండా, హత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పరామర్శించడం జగన్‌ నైజానికి అద్దం పడుతోందని విమర్శించారు.

పల్నాడు ఫోన్‌ పరామర్శల వెనుక విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు శాసనసభ, శాసనమండలిలో గట్టిగా సమాధానం చెబుతామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా శాసనసభకు దూరంగా ఉండటం జగన్‌రెడ్డి రాజకీయ పతనానికి నిదర్శనమని విమర్శించారు.