ఎయిడ్స్‌ నియంత్రణకు భారీ ర్యాలీ

1500 మందితో నెక్లెస్‌ రోడ్‌ వరకు అవగాహన ప్రదర్శన
హెచ్‌ఐవీ రహిత తెలంగాణే లక్ష్యం
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అపోహలు వీడి అవగాహన పెంచుకోవాలి
వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, సిఫిలిస్‌ వంటి వ్యాధుల నియంత్రణ, నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం, అపోహలను తొలగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వద్ద ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వరకు సాగిన ఈ అవగాహన ర్యాలీలో సుమారు 1500 మంది పాల్గొన్నారు. వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అవగాహన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హెచ్‌ఐవీ నివారణపై ప్రజలకు సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సమాజంలో ఉన్న భయాలు, అపోహలను తొలగించి, వ్యాధి నియంత్రణకు అవసరమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

కొత్తగా ఎవరూ హెచ్‌ఐవీ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు, పరీక్షలు, చికిత్సపై ప్రజల్లో అవగాహన పెరగాలని మంత్రి సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా వారికి అవసరమైన వైద్య సహాయం, మానసిక మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.

హెచ్‌ఐవీతో జీవిస్తున్న తల్లుల నుంచి పుట్టే శిశువులకు వైరస్‌ సంక్రమించకుండా ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రజలు భయపడకుండా సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి నివారణకు వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములై హెచ్‌ఐవీ నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

“Be Positive – Stop HIV Positive” అనే నినాదంతో తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, సమాచార శాఖ కమిషనర్‌ ముకుంద రెడ్డితో పాటు పలువురు అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.