భట్టి భార్యపై గవర్నర్‌కు ఫిర్యాదు!
కమీషన్ ఆరోపణలు.. విచారణకు డిమాండ్
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదలలో కమీషన్ డిమాండ్ చేశారంటూ ఆరోపణలు..
విచారణ జరపాలని కోరిన అడ్వకేట్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందినిపై ఆరోపణలు చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగా అడ్వకేట్, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలకు సంబంధించి నందిని భట్టి కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.40 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కోసం 10 శాతం కమీషన్‌గా రూ.4 లక్షలు అడిగినట్లు ప్రసన్నకుమారి ఆరోపించారని తెలిపారు.
రూ.120 కోట్ల బిల్లుల అంశం
మెడికల్ అండ్ హెల్త్ శాఖలో సుమారు రూ.120 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి 6 నుంచి 10 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వం లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన, ఖండన వెలువడలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
స్వతంత్ర విచారణకు డిమాండ్
ఆరోపణలపై కేసు నమోదు చేసి స్వతంత్ర, నిష్పక్షపాత విచారణను కాలపరిమితిలో పూర్తి చేయాలని కరుపోతుల రేవంత్ గవర్నర్‌ను కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, బిల్లుల ఫైళ్ల కదలికపై సమగ్ర పరిశీలన జరిపి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను ఏసీబీ, లోకాయుక్త, సీఎస్, డీజీపీ, ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌కు కూడా పంపించినట్లు తెలిపారు.
