ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు వేగవంతం చేయాలి..

  • నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏళ్లుగా ఉప్పల్‌ మార్గంలో ట్రాఫిక్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కారిడార్‌ పనుల వేగం పెంచేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. పనులు మూడు షిఫ్టుల్లో నిర్వహించేలా మానవ వనరులను పెంచాలని సూచించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పనులు కొనసాగించాలని ఆదేశించారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ కింద ఉన్న 6.25 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నారపల్లి, ఉప్పల్‌ వైపులా లాంచింగ్‌ గడ్డర్ల వినియోగంతో పనుల వేగాన్ని మరింత పెంచాలని సూచించారు.

2026 అక్టోబర్‌ (దసరా) నాటికి ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పది రోజులకు ఒకసారి తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.