కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌

నాగార్జున సాగర్‌ నీటి విడుదల, ప్రాజెక్టుల సమీక్షపై మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత విమర్శలు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నాగార్జున సాగర్‌ నీటి విడుదల అంశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సాగర్‌ నిండినా రైతులకు నీరు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పినట్లు ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కానీ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగదీష్‌ రెడ్డి అన్నారు.

‘రైతుల పరిస్థితిని పట్టించుకోవడం లేదు’

కేవలం నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ నీటితోనే 4 నుంచి 5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని జగదీష్‌ రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవుడి దయతో మొదటి పంటకు అవకాశం ఏర్పడిందని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. నల్గొండ, నాగార్జున సాగర్‌ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.

పోతిరెడ్డిపాడు అంశంపై ఆరోపణలు

నాగార్జున సాగర్‌కు సరైన నీటి ప్రవాహం లేకుండానే పోతిరెడ్డిపాడు గేట్లు తెరిపించి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రాజెక్టుల సమీక్షపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలో తెలంగాణ నిర్మించిన ఏడు ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టాలని లేఖ రాస్తే, దానిని ఎజెండాలో చేర్చారని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించకపోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

కేఆర్‌ఎంబీ ఎజెండాపై హెచ్చరిక

ప్రాజెక్టుల సమీక్ష అంశాన్ని ఉపసంహరించుకోవాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారితో లేఖ పెట్టించినట్లు జగదీష్‌ రెడ్డి తెలిపారు. కేఆర్‌ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల సమీక్ష అంశాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమావేశానికి హాజరై తమ నిరసన తెలియజేస్తాయని హెచ్చరించారు.