Zimbabwe | 15 మంది మృతి..
కరీబా సరస్సులో బోల్తాపడ్డ పడవ.. 27 మంది గల్లంతు
Zimbabwe | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ అదుపుతప్పి సరస్సులో బోల్తాపడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సరస్సులో గాలింపు చేపడుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పడవలో ప్రయాణించేందుకు గరిష్ఠంగా 90 మంది సామర్థ్యం మాత్రమే ఉన్నప్పటికీ, అంతకంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. టికెట్లు తీసుకోని చిన్నారులు కూడా పడవలో ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన వారిని గుర్తించి, వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు సహాయక బృందాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి.
