గోదావరి జలాలపై సీఎం ఫోకస్..
- గోదావరి జలాల వినియోగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
- ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి గరిష్ఠంగా ఎత్తిపోతలు చేపట్టాలని ఆదేశం
- మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నీటి వినియోగంపై అధికారులతో చర్చించారు.
దేవాదుల ప్రాజెక్టు నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఉన్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం అధికారులకు సూచించారు.
పలు ప్రాజెక్టుల పరిధిలో ఒకటి రెండు గ్రామాలు, కొంత వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం దృష్టికి వచ్చింది. వాటిని త్వరగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం పేర్కొన్నారు. అధికారులు ఈ పనులు పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీటిని నింపే అవకాశం ఉంటుందని తెలిపారు.
గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు.
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీటి నిల్వకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను పాటించాలని సీఎం స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ప్రస్తుతం ఆయా బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం లేదని సమావేశంలో మంత్రి వివరించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ పలు లోపాలు ఉన్నట్లు తేలిందని పేర్కొనగా.. ఈ అంశంపై ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు.
