సకాలంలో న్యాయం అందాలంటే సమన్వయం కీలకం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సకాలంలో న్యాయం అందాలంటే క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని అన్ని విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీస్, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్, వైద్య, ఫోరెన్సిక్, జైళ్ల శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పాటు సాంకేతికతను సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నెల గురువారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘కొత్త క్రిమినల్ చట్టాలు–డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేయడం’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డితో పాటు న్యాయ, పోలీస్, జైళ్ల, ప్రాసిక్యూషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.
డిజిటల్ అమలుపై సమీక్ష
సదస్సు సన్నాహకాల్లో భాగంగా కొత్త క్రిమినల్ చట్టాల డిజిటల్ ఆధారిత అమలుకు సంబంధించిన అన్ని భాగస్వామ్య శాఖలతో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. సదస్సులో ప్రదర్శించనున్న ప్రజెంటేషన్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ఎదురవుతున్న సవాళ్లు, దర్యాప్తు నుంచి విచారణ వరకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని ఎలా మరింత బలోపేతం చేయాలనే అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ఈ-సాక్ష్య నుంచి డిజిటల్ కేసు నిర్వహణ వరకు
సదస్సులో ఈ-సాక్ష్య, ఈ-ఎఫ్ఐఆర్, డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాల నమోదు, డిజిటల్ కేసు నిర్వహణ వంటి అంశాలపై సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దర్యాప్తు, విచారణ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించడంపై దృష్టి సారించనున్నారు.
జాతీయ స్థాయిలో ర్యాంకు మెరుగుపర్చాలి
శాఖల మధ్య తగిన సమన్వయం లేకపోవడం వల్ల గడువుల పాటింపు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో తెలంగాణ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తక్కువ ర్యాంకులో ఉందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నిర్దేశిత గడువులను కచ్చితంగా పాటించడం, సాక్ష్యాలు, నివేదికలను వేగంగా డిజిటల్ విధానంలో సమర్పించడం ద్వారా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర పనితీరును మెరుగుపరచవచ్చన్నారు.
దర్యాప్తు నుంచి విచారణ వరకు ప్రతి దశలో సమన్వయం, సాంకేతికతను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం అందించడమే సదస్సు ప్రధాన లక్ష్యమని సీవీ ఆనంద్ తెలిపారు.
