పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగించొద్దు
నర్సంపేట, ఆంధ్రప్రభ: ఓరుగల్లు ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించవద్దని కోరుతూ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట ఆర్డీవో, వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీకి వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషికి గుర్తుగా అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాజకీయ కారణాలతో తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు.
నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటుకు పెద్ది సుదర్శన్‌రెడ్డి విశేష కృషి చేశారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఆయన సేవలకు గుర్తుగా వైద్య కళాశాల వద్ద అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమని, అనంతరం అదే ప్రాంతంలో మళ్లీ గద్దె నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
రాజకీయ కుట్రల్లో భాగంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి విగ్రహంపై చర్యలు తీసుకుంటే ప్రజలు క్షమించరని అన్నారు.
దివంగత నేత ప్రజాసేవకు గుర్తుగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని యథాతథంగా కొనసాగించాలని అధికారులను కోరారు. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
