ఐఐటీ మద్రాస్‌తో ఎంవోయూ
- రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం..
- నవంబర్ నుంచి పనులు ప్రారంభం
అమరావతి, ఆంధ్రప్రభ: సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పడింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఐఐటీ మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.323 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధుల ఆమోదంతో చేపట్టనున్న ఈ పనులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది.
శాస్త్రీయ అధ్యయనాలతో డిజైన్..
ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ నిపుణుల సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు.తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, వాటికి అనుగుణంగా రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేయనున్నారు.
నవంబర్ నుంచి పనులు..
ఐఐటీ మద్రాస్‌తో ఒప్పంద ప్రక్రియ పూర్తవడంతో నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి శరవణన్, పాడా డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఏ. సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జి.వి. రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

