మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం సమాజ పురోగతికి కీలకమని, విద్య, ఉపాధి, నాయకత్వ స్థానాల్లో మహిళలు రాణించినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని కమ్మర్‌పల్లి ఎస్‌ఐ చిర్ర సతీష్ అన్నారు.
బుధవారం కమ్మర్‌పల్లి మండలం కోన సముందర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పిల్లల భద్రత, చట్టాలు, క్రమశిక్షణపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఐకేపీ ఏపీఎం గోపు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేశ్ మాట్లాడుతూ మహిళలు అనవసర ఖర్చులకు దూరంగా ఉండి, సమైక్య సంఘాల ద్వారా పొందే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడీ మధులత శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
అనంతరం మహిళా సమైక్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా షేక్ నస్రిన్ బేగం, ఉపాధ్యక్షురాలిగా గుడిసె లక్ష్మి, కార్యదర్శిగా కటకం లాస్య, కోశాధికారిగా పోతనక మేఘన, సహాయ కార్యదర్శిగా యాట దీపిక ఎన్నికయ్యారు.
కార్యక్రమం అనంతరం కమ్మర్‌పల్లి ఎస్‌ఐ చిర్ర సతీష్‌ను మహిళలు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బలేరావ్ శంకర్, ఐకేపీ సీసీ రవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలత, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజు, సీఏలు నయన, బాలమణి, దుంపల లత, గ్రామ మహిళా సమైక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
