TG | సింగరేణిలో ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం !

సింగరేణిలోని హైదరాబాద్ కార్యాలయంతో సహా అన్ని ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ శ్రీ ఎన్. బలరామ్ సంచలనాత్మక ప్రకటన చేశారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, “ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం” అనే నినాదాన్ని స్వీకరించిన సీఎండి బ‌ల‌రామ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లను అస్సలు వాడకూడదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి తన సందేశమిచ్చారు. సింగరేణి సంస్థలో ఇప్పటికే పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపడుతున్నామని, కొన్నిచోట్ల ప్లాస్టిక్ ను వాడటం మానేశారని, అయినప్పటికీ ఈ ఏడాది ఇచ్చిన ప్రపంచ పర్యావరణ నినాదాన్ని అనుసరించి సింగరేణి కార్యాలయాలు, గనులు, డిపార్ట్ మెంటులలో ప్లాస్టిక్ తో తయారుచేసిన బాటిల్స్, ప్లేట్లు, వస్తువులు తదితరాలపై ఇక సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

సంస్థలోని అధికారులను, కార్మికులు, ఉద్యోగులు దీనికి సహకరించాలని కోరారు. తమ ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలని సూచించారు. పర్యావరణం పట్ల అభిమానంతో తాను ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 19 వేల మొక్కల్ని నాటానని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని సంస్థ డైరెక్టర్లు, ఇతర కార్మికులు కూడా మొక్కలు నాటడం ప్రారంభించారని ఇది ఎంతో సంతోషకరమన్నారు.

ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటాలని, అటువంటి ఆసక్తి గల వారికి సింగరేణి సంస్థ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తుందని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం సింగరేణి ప్రాంతాల్లో ఎండాకాలం 50 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండేవని, సింగరేణి సంస్థ విస్తారంగా మొక్కలు నాటిన కారణంగా, ఆ మొక్కలు అడవులుగా పెరిగి వాతావరణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ కు ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని ఉన్న అంగుల్ ప్రాంతంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు స్థానికులు తెలియజేశారని చెప్పారు. కనుక అక్కడ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి సింగరేణి సంస్థ సంసిద్ధమవుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్ ) ఎస్ డీ ఎం. సుభాని, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ ) ఎన్.వి. రాజశేఖర్ రావు, ఇంకా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పర్యావరణం పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ఛైర్మన్ బహుమతుల్ని అందజేశారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న ఉద్యోగులకు జ్యూట్ బ్యాగుల్ని పంపిణీ చేశారు.

Leave a Reply