హైదరాబాద్ -ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై నేడు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాగా నీతులు చెప్పారన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలుస్తూ ఆధికార పార్టీపై మండిపడ్డారు. గత ఏడాది అంచనాలు పెంచి చూపించారని, ఇప్పుడు బడ్జెట్ అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. ఈ క్రమంలోనే చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు అంటూ కామెంట్ చేశారు. రైతు భరోసా పథకం పేరు మార్చేశారు కానీ.. డబ్బులు ఇవ్వలేదని అన్నారు. కౌలు రౌతులకు రైతు బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు.
మాట తప్పిందెవరు
గతంలో ఫార్మా సిటీకి భూములు సేకరిస్తే కాంగ్రెస్ నిరసనలు చేసిందని.. కాంగ్రెస్ వచ్చాక ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామన్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక వెనక్కి ఇచ్చేది పోయి మళ్లీ లాక్కుంటామని చెబుతున్నారన్నారు. ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి తిరిగి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో నిర్ధరక ఆస్తులు అమ్మితే ఎలా విక్రయిస్తారన్నారని అన్నారు. రుణమాఫీలో విఫలమైనవారు..తమ చిత్తశుద్ధిని శంకిస్తున్నారని గతంలో భట్టి చెప్పారని.. అయితే ఇవాళ చేతగానివారెవరు, మాట తప్పిందెవరు.. చిత్తశుద్ధిలేని వారెవరో తేలిపోయిందని మాజీ మంత్రి వెల్లడించారు.
అమ్మ కానికి గచ్చిబౌలి భూములు.
గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు అప్పు తెస్తామని చెప్పారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇంకా 14 వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారని విమర్శించారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారన్నారు. ఈరోజు బరాబర్ భూములు అమ్ముతాం అంటున్నారని హరీశ్‌రావు చెప్పారు.
పెట్టుబడులు ఆగిపోయాయ్
ఈసారి బడ్జెట్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదన్నారు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుకూలీ పెంచినట్లు చెప్పారని.. కుట్టుకూలీ రూ.50 నుంచి రూ.75కి పెంచినట్లు చెప్పారన్నారు. రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాపీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైందని ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో పథకం కింద రైతుబంధు నిధులు ఇస్తామని చెప్పారని.. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారని.. కౌలు రైతులను రైతులే చూసుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇళ్లు కాదు కదా.. 4 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు ఇళ్లు కట్టుకుంటే రూ.6 లక్షలు ఇస్తామని గొప్పగా చెప్పారని.. ఈసారి ప్రసంగంలో రూ.లక్ష మాయమైందని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో వాహనాల అమ్మకాలు జోరుగా జరిగాయన్నారు. తెలంగాణలో వాహనాల విక్రయాలు పడిపోయాయని తెలిపారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా అని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ అని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారని.. సీఎం ప్రచారంతో తెలంగాణకు పెట్టుబడులు ఆగిపోయాయంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపాం
గతంలో దివాళా తీసింది రాష్ట్రం కాదని.. తమరి ఆలోచనా విధానమన్నారు. కాంగ్రెస్ విధానాలు, పరిపాలనలో దివాళాతనం కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీయలేదని గమనించాలన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆవిరయ్యాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారని తెలిపారు. లక్షలోపు మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారన్నారు. ప్రధాన ప్రతిపక్షం సూచనలు తీసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. 2014లో రూ.62వేల కోట్ల నుంచి 2023 నాటికి రూ.2.31 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయం 4 రెట్లు పెంచామని చెప్పుకొచ్చారు. ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపామన్నారు. బీఆర్‌ఎస్ కృషితో తెలంగాణలో సాగు విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వ అసమర్థతతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితి అని అన్నారు. చేతి గుర్తు చేతకాని పాలనలో రైతు మళ్లీ అప్పు కోసం చేయి చాచాల్సి వస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రూ.49,500 కోట్లు కావాలని మాజీ మంత్రి అన్నారు.
అన్నింటిలో తగ్గుదలే
‘అందినకాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములు అమ్ముడు. ఇదే రేవంత్ మార్కు పాలన. తన పరిపాలన నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు తగ్గిపోతుంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి సీఎం ఈ మధ్య కొత్త వాదన షురూ చేసిండు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉందో మరి. అంతా నాకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం అహంకారం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయ్యిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం మనకే వచ్చిందా? మీ నెగిటివ్ పాలసీలు, మీ నెగిటివ్ పాలిటిక్స్ మూలంగా ఆదాయం కుంటుపడింది. రేవంత్ పాదం మోపిన వేళా విశేషం ఏమో గానీ, ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తున్నది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల. దీనికి కారణం ఆర్థిక మాంద్యమా. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా. ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు అధ్యక్షా.. ప్రభుత్వ మాంద్యం, ప్రభుత్వ వైఫల్యం. నేను చాలా బాధగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి ఇస్తున్న నినాదం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు, ఐ యాం ఆస్కింగ్ వేర్ ఈజ్ ఇట్ రైజింగ్. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్.. వెహికిల్ సేల్స్ డౌన్’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.