ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : మనుషులకు ఆధార్ నంబర్ లాగ భూములకు భూధార్ నంబర్ ఏకైక గుర్తింపు అని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎర్రపాలెంలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించేందుకు భూభారతి చట్టం-2025ను అమలు చేస్తున్నామన్నారు. ఈ భూధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబర్, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలను సులభంగా, పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను తారుమారు చేసి, రైతులకు ఇబ్బందులు కలిగించారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా రెవెన్యూ సదస్సులను ప్రారంభించిందన్నారు. మంగళవారం ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సదస్సుల్లో సాదాబైనామా, మ్యూటేషన్, సర్వే నంబర్ తప్పులు, వారసత్వ సమస్యలు, నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో బోనకల్లు, నేలకొండపల్లి వంటి మండలాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరించారు. ఎర్రపాలెం సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి భూధార్ వ్యవస్థ రైతులకు భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు నాందిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని, అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ ద్వారా వీటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం రైతులకు న్యాయం చేయడంతో పాటు, భూ రికార్డులలో పారదర్శకతను తీసుకొస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎక్కడైనా ప్రభుత్వ మిగులు భూములు ఉంటే వాటిని ప్రజా వినియోగం కోసం ఉపయోగించుకునేలా అసైన్ మెంట్ కమిటీలను తిరిగి ప్రవేశపెట్టబోతున్నామని, అలాగే భూభారతి చట్టాన్ని అత్యంత పారదర్శకంగా తీసుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే చట్టాన్ని జాగ్రత్తగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశామని, ఈ కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంతో ఉందో తెలిసేది, ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదన్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందన్నారు.
దేశంలో అరుదైన చట్టం భూభారతి
భూభారతి లాంటి చట్టం మన దేశంలో చాలా అరుదుగా వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ధరణి వల్ల రైతులు ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి అలసిపోయారే తప్ప పరిష్కారం దక్కలేదన్నారు. అధికారుల నుంచి జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దలేకపోయారని విమర్శించారు. ఈ పరిస్థితిపై ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాట ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ధరణిని తొలగించి దాని స్థానంలో భూభారతి-2025 కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రజా ప్రభుత్వం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు ప్రస్తావనకు వస్తుందన్నారు. ఈ ఏడాది నాట్లు ప్రారంభం కాకముందే రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జయ చేయనున్నట్లు మంత్రి అన్నారు.