12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి..

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు

శ్రీ సత్యసాయి , ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)ని వెంటనే ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జి.ఎల్. నరసింహులు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ వేతన సవరణ సంఘం గడువు ముగిసి ఇప్పటికే 36 నెలలు పూర్తయినా ప్రభుత్వం ఇప్పటి వరకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సేవల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తున్నప్పటికీ, వారి న్యాయమైన హక్కుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం ఆందోళనకరమన్నారు.

12వ పీఆర్‌సీ అమలులో జాప్యం జరిగినందున ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి (ఇంటరిమ్ రిలీఫ్) ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన కుటుంబ సభ్యులకు ఆలస్యం లేకుండా ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని సీఐటీయూ తరఫున మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాత పెన్షన్ విధానమే సరైనదని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సిన నాలుగు డీఏ బకాయిలను, 11వ పీఆర్‌సీ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు తమ న్యాయమైన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టే ఉద్యమాలకు సీఐటీయూ పూర్తి మద్దతు అందిస్తుందని జి.ఎల్. నరసింహులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని పెండింగ్ డిమాండ్లన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.