నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో అకాల వర్షం

నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో అకాల వర్షం
- తడిసిన మొక్కజొన్న
నాగర్‌కర్నూల్ , ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులను ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం పడటంతో ఆరబోసిన మొక్కజొన్న రాశులు తడిసిపోయాయి.
గత వారం రోజులుగా రైతులు తమ మొక్కజొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి అమ్మకం కోసం నిరీక్షిస్తున్నారు. నిబంధనల ప్రకారం కూపన్లు వచ్చి, కాంటా అయ్యే వరకు ధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తే అవకాశం లేకపోవడంతో యార్డు ఆవరణలోనే కుప్పలుగా పోసి ఉంచారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు కవర్లు కప్పుతూ, ధాన్యం తడవకుండా ఉండేందుకు వానలో తడుస్తూ నానా అవస్థలు పడ్డారు.
యార్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు 74 వేల బస్తాల మొక్కజొన్న సంచుల్లో నిల్వ ఉండగా, మరో 30 వేల బస్తాల మొక్కజొన్న రాశుల రూపంలో బయటే ఉండిపోయింది. చాలామంది రైతులు ముందు జాగ్రత్తగా కవర్లు కప్పుకున్నప్పటికీ, కొన్ని వందల బస్తాల మేర మొక్కజొన్న తడిసినట్లు తెలుస్తోంది. వర్షపు నీరు ధాన్యం కుప్పల కిందికి చేరడంతో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యంపై కవర్లు గట్టిగా కప్పి ఉంచడం వల్ల పెద్దగా ప్రమాదం లేదని కొందరు రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆరబోసిన పంట మాత్రం తేమ బారిన పడింది. ఇప్పటికే మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ అకాల వర్షం తమను మరింత కుంగదీసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.
