ధాన్యం అన్లోడింగ్ పక్రియను వేగవంతం చేయాలి…

ధాన్యం అన్లోడింగ్ పక్రియను వేగవంతం చేయాలి…
చిట్యాల, ఆంధ్రప్రభ : రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా ,చిట్యాల మండల కేంద్రంలోని ఉదయ్ రైస్ మిల్, వెంకటేశ్వర రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లు యజమానులతో ఆయన మాట్లాడుతూ ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.రోజుకు కనీసం 10 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలని, పనిని తగ్గించకుండా పూర్తి సామర్థ్యంతో కొనసాగించాలని చెప్పారు.

అలాగే హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు పడే సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తనిఖీ సమయంలో గోదాముల్లో గన్ని బ్యాగుల నిల్వలు, స్థలము, అన్‌లోడింగ్ జరుగుతున్న లారీలను పరిశీలించిన కలెక్టర్ రోజుకు ఎన్ని లారీలు అన్‌లోడ్ అవుతున్నాయని, ప్రస్తుతం ఎంతమంది హమాలీలు పనిచేస్తున్నారని? వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అవసరానికి అనుగుణంగా మరింత మంది హమాలీలను నియమించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అన్లోడింగ్ తొందరగా చేయకపోతే సంబంధిత మిల్లులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే రా రైస్ మిల్లు నుంచి హమాలీలను తీసుకొచ్చి వారితో అన్లోడింగ్ చేయించాలని, ఆదేశించారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని మిల్లు యజమానులను కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డిఎం రాంపతి నాయక్, తహసిల్దార్ విజయ్, పౌరసరఫల డిటి ప్రదీప్, మిల్లు ఓనర్లు రమేష్ ,నరేష్. జిపిఓ జ్యోతి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

