విద్యాసంస్థ ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళ
ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గాండ్ల రాజేష్
బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల,కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం ఘనంగా స్వాగత వేడుకలు నిర్వహించారు.నూతన విద్యార్థులను అధ్యాపకులు,సీనియర్ విద్యార్థులు ఆత్మీయంగా ఆహ్వానించగా విద్యాసంస్థ ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ గాండ్ల రాజేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో విద్యను అభ్యసించి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.
విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు.పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.ఇటీవల పాఠశాలలో నిర్వహించిన విద్యార్థి నాయకత్వ ఎన్నికల్లో విజయం సాధించిన హెడ్ బాయ్,హెడ్ గర్ల్‌లను అభినందించి సన్మానించారు.వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్రాభివృద్ధే విద్యాసంస్థ ప్రధాన లక్ష్యమని, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు తిరునగిరి నవీన్,తెడ్డు సందీప్,నాయకులు రహీం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గణేష్,అధ్యాపక బృందం,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
