ఆదివాసీల పోడు భూములకు పట్టాలివ్వాలి

ఆదివాసీల పోడు భూములకు పట్టాలివ్వాలి

  • ఐటీడీఏ ముట్టడి

ఉట్నూరు, ఆంధ్రప్రభ: ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉట్నూరులో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీగా వెళ్లిన బాధితులు, నాయకులు ఐటీడీఏ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పి.వి.టి.జి. ఏపీఓ ఆత్రం భాస్కర్‌లకు అందజేశారు. గిరిజనుల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీఓ వసంతరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ ధర్నాలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. వెంకటాద్రి మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా ఆదివాసీలు తమ సమస్యలపై పోరాడుతున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.

అభివృద్ధి, అడవుల సంరక్షణ, హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లో మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యల ద్వారా వారిని భూముల నుండి తరిమివేస్తున్నారని ఆరోపించారు.

1/70 చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలు కావడం లేదని, ప్రతి ఏటా సాగు సమయంలో అటవీ, పోలీస్ యంత్రాంగం గిరిజనులపై దాడులకు తెగబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టైగర్ జోన్ల ఏర్పాటు పేరుతో ఆదివాసీలను మభ్యపెట్టి గ్రామాల నుండి ఖాళీ చేయిస్తున్నారని, మనుషుల కంటే పులులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

1/70 చట్టం ప్రకారం కోర్టు తీర్పులు గిరిజనులకు అనుకూలంగా వచ్చినా, రెవెన్యూ అధికారులు పంచనామాలు నిర్వహించి భూములను అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గిరిజన గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం నాయకులు కుటికెల శంకర్, సిడం ధర్మం (ఆసిఫాబాద్), ధారంగుల ఎల్లయ్య, ఎనుముల నరసయ్య (మంచిర్యాల), మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యారాణి, పీడీఎస్యూ నేత వాగ్మారీ సంబాజీ, సోయం జుగాధిరావు (ఆదిలాబాద్), గోపి చంద్రయ్య (జగిత్యాల) మరియు ఉమ్మడి జిల్లాల ఆదివాసీలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply