హక్కుల సాధనకు కలిసి పోరాడుదాం

హక్కుల సాధనకు కలిసి పోరాడుదాం
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు ఎవరూ అధైర్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మబలిదానాలకు ఒడిగట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హక్కుల సాధన కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. పీఆర్సీ (PRC) తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. “మీ వెంటే మేమున్నాం” అని కార్మికులకు ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన మానుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి వారిలో విశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.
